దుబ్బ దానయ్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి.


 దుబ్బ దానయ్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

రాజకీయాలకు అతీతంగా చట్టానికి సహకరించాలి: ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు

పలాస, జూలై 16 : పలాసలో దుబ్బ దానయ్య మృతి ఘటన అత్యంత విషాదకరమని, ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దానయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, అయితే ప్రమాదం అనంతరం బాధితుడికి సకాలంలో వైద్యం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక, మానవతా బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ ఘటనలో ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించడంలో ఎందుకు జాప్యం జరిగిందనే అంశంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే ప్రాణాలు దక్కేవా అనే ప్రశ్నకు సమాధానం దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.

అదేవిధంగా, ఘటనలో వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందా, ప్రమాద సమయంలో వాహనం నడిపింది ఎవరు అనే అంశాలపై నెలకొన్న వివాదాలు, అమాయక యువకుడిపై కేసు మళ్లించే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి చట్టాన్ని గౌరవించి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని వజ్జ బాబూరావు అన్నారు. వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేశారనే అభిప్రాయం ప్రజల్లో కలగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన కేసు హత్యకు సంబంధించినది కాదని, దర్యాప్తుకు ఆటంకం కల్పించడం, ఆధారాలను ప్రభావితం చేయడం, వాస్తవాలను తప్పుదోవ పట్టించడం వంటి ఆరోపణలకు సంబంధించిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదైందని తెలిపారు. ఏ సెక్షన్లు వర్తిస్తాయో, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు.

ఈ ఘటనను రాజకీయ కోణంలో చూసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయకుండా, వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా అందరూ సహకరించాలని ఆయన కోరారు.

బాధిత కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయిందని, వారికి ప్రభుత్వం ఇప్పటికే అండగా నిలిచిందని పేర్కొంటూ, నైతిక బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రాజకీయాలకు అతీతంగా చట్టాన్ని గౌరవించి, దర్యాప్తుకు పూర్తిగా సహకరించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగేలా తన వంతు బాధ్యత నిర్వర్తించాలని వజ్జ బాబూరావు కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post