అంపోలు సబ్‌జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేశారంటూ ఆరోపణలు
శ్రీకాకుళం, జూలై 24 :
అంపోలు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం ములాఖాత్‌లో కలిసి పరామర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు కుంబా రవిబాబు జైలుకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలపై ఆరా తీశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి అప్పలరాజుపై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
చట్టపరమైన పోరాటం ద్వారా నిజం బయటపడుతుందని, న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని నేతలు తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
