కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహికి విప్లవ జోహార్లు.. ఘనంగా ప్రధమ వర్ధంతి.


 కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహికి విప్లవ జోహార్లు.. ఘనంగా ప్రధమ వర్ధంతి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన

బొడ్డపాడు, జూలై 24 : 

విప్లవ కవి అమరుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి జీవిత సహచరి కామ్రేడ్ సురేఖ పాణిగ్రాహి ప్రధమ వర్ధంతిని శుక్రవారం బొడ్డపాడు కాలనీలో విప్లవ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, విప్లవ నినాదాలతో జోహార్లు తెలిపారు.

వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లిన శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో తన కళను, గళాన్ని ఉద్యమానికి అంకితం చేసిన విప్లవ సాంస్కృతిక యోధుడు కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అని కొనియాడారు. "ఒక చేతిలో పెన్ను, మరో చేతిలో గన్ను"తో ప్రజల విముక్తి కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన అనంతరం సుమారు ఐదు దశాబ్దాల పాటు ఒంటరిగా జీవితం సాగించిన సురేఖ పాణిగ్రాహి విప్లవోద్యమానికి అండగా నిలుస్తూ, ఆయన ఆశయాలు, విప్లవ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని, ఉద్యమ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, రచయితలు, కవులు ఆమె నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. సుబ్బారావు పాణిగ్రాహి చూపిన మార్గమే దేశ విముక్తికి సరైన మార్గమనే విశ్వాసాన్ని సురేఖ పాణిగ్రాహి చివరి వరకు నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.

సురేఖ పాణిగ్రాహి, సుబ్బారావు పాణిగ్రాహి కుటుంబ సభ్యుడు నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామడ సన్యాసిరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్రి దానిష్, ప్రగతిశీల కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధన, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు మద్దిల రామారావు, స్వేచ్ఛ మహిళా సంఘం నాయకురాలు నాగమణి, పీడీఎం నాయకులు పోతనపల్లి వైకుంఠరావు తదితరులు పాల్గొని సురేఖ పాణిగ్రాహికి ఘనంగా నివాళులర్పించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post