హుద్‌హుద్, టిడ్కో ఇళ్ల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం.
పలాసలో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష – మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో అధికారులకు కీలక ఆదేశాలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 22 : పలాస నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హుద్‌హుద్ గృహాలు, టిడ్కో ఇళ్ల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ లక్ష్యమని, నిరుపేదలకు ఇళ్ల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పలాస మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ బాధితులు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. అధికారంలోకి రావడానికి ముందు హుద్‌హుద్ ఇళ్లను వెంటనే అప్పగిస్తామని హామీలు ఇచ్చిన వారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు ఇళ్లను పూర్తి చేయకుండా కేవలం రంగులు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది లబ్ధిదారులు సొంత ఇంటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని చెప్పారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా పలాస పరిధిలోని హుద్‌హుద్ గృహాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారని, సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి, మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన అంచనాలను (ఎస్టిమేట్లు) వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
మంత్రి చొరవతో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హుద్‌హుద్ గృహాలు, టిడ్కో ఇళ్ల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సమావేశాలతో కాలయాపన చేసే ప్రభుత్వం కాదని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కార మార్గాలు చూపే ప్రజా ప్రభుత్వమని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, పలాస నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


