వంశధార-2 నేరడి బ్యారేజీకి రూ.641 కోట్లు మంజూరు – శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి శుభవార్త: ఎమ్మెల్యే గౌతు శిరీష.


 వంశధార-2 నేరడి బ్యారేజీకి రూ.641 కోట్లు మంజూరు – శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి శుభవార్త: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస జూలై 23:

శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసి, అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్న దశాబ్దాల ఆకాంక్ష నెరవేరే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసిందని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.641 కోట్లను మంజూరు చేయడం జిల్లా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

1956 జూలైలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంతో రూపుదిద్దుకున్న వంశధార ప్రాజెక్టు ద్వారా మొత్తం 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం నిర్దేశించబడిందని ఆమె తెలిపారు. మొదటి దశ పూర్తయినప్పటికీ, రెండో దశ 1961 నుంచి న్యాయపరమైన వివాదాలతో నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఆశించిన స్థాయిలో చొరవ చూపకపోవడంతో పనులు ముందుకు సాగలేదని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఒడిశా ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపారని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఉన్న అడ్డంకులను అధిగమించి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యేలా కృషి చేశారని చెప్పారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూ.641 కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

నేరడి బ్యారేజీ పూర్తయితే జిల్లాలో అదనంగా 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు.

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే ఈ ప్రాజెక్టు సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పలాస నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post