ఎఫ్‌ఎల్‌ఎన్ డీఆర్‌పీల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతం.
ఉపాధ్యాయులు అంకితభావంతో నిపుణ్ భారత్ లక్ష్యాలను సాధించాలి – ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు రామచంద్ర మిషన్‌లో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) డీఆర్‌పీల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ శిక్షణా కార్యక్రమాన్ని గుంటూరు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) లింగేశ్వర్ రెడ్డి, మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు సందర్శించి శిక్షణ పొందుతున్న డీఆర్‌పీలతో ముచ్చటించి విలువైన సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నిపుణ్ భారత్ లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు.
మార్కాపురం డీఈఓ సామా సుబ్బారావు మాట్లాడుతూ, విద్యార్థి కేంద్రిత విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
డిజిటల్ పరికరాల వినియోగంతో బోధనను మరింత అర్థవంతంగా చేయాలని, తమ జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఎక్కువ పుస్తకాలు చదవడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ ఐదు రోజుల శిక్షణలో అనుభవజ్ఞులైన కేఆర్పీలు తెలుగు, ఆంగ్లం, గణితం, జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఈపీ-2020), టీఏఆర్‌ఎల్ , దీక్ష, మిస్ కాన్సెప్ట్స్, కరిక్యులర్ గోల్స్ అండ్ కంపిటెన్సీస్ వంటి అంశాలపై డీఆర్‌పీలకు సమగ్ర శిక్షణ అందించారు.
శిక్షణా కాలంలో ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి సి.వి. రేణుక, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ హాజరై శిక్షణార్థులకు విలువైన సూచనలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో ఉపాధ్యాయులకు ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏఎంఓ నాగేంద్ర నాయక్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ కుమార్, శిక్షణ పరిశీలకురాలు సౌజన్య, కేఆర్పీలు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, రాజేష్, వీరభద్రం, ప్రకాశం ,మార్కాపురం జిల్లాల డి ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.
