త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.



 త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ప్రకాశం జిల్లా ఈ వేసవిలో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు సురక్షిత త్రాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు. 

బుధవారం అద్దంకి ఆర్డిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్., ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా శాఖల ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై అలాగే కొరిశపాడు రిజర్వాయర్ కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులపై సమీక్షించి, దిశానిర్దేశం చేసారు.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొరిశపాడు రిజర్వాయర్ కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ త్వరగా పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

 ఈ వేసవిలో అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు సురక్షిత త్రాగునీటి సరఫరా పై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  

గత డిసెంబర్ మాసంలో జల సురక్ష మాసంలో భాగంగా తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, వాటర్ ను టెస్ట్ చేయడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తాగునీటి వనరుల వద్ద జంగిల్ క్లియరెన్స్ చేపట్టడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో నేడు జల సురక్ష కార్యక్రమాన్ని మిషన్ మోడ్ లో చేపట్టడం జరుగుచున్నదన్నారు. ఎక్కడా తాగు నీరు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.   

 రానున్న వర్షాకాలంలో వర్షం నీరు వృధాగా పోకుండా జల సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వేసవిలో చెరువులు, కాలువల పూడికతీత పనులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టడం, లింక్ కెనాల్స్ క్లియర్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐవిఆర్ఎస్ సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారుల పనితీరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 

తాగునీటి సరఫరా, శానిటేషన్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐ.వి.ఆర్.ఎస్. సర్వేలో ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా మున్సిపల్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అద్దంకి పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం, చేతిపంపులకు, కుళాయిలకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, భూగర్భ నీటిమట్టం పెంచడం వంటి పనులలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్సన్ , ఆర్ డబ్ల్యూఎస్ ఎస్.ఈ,నాగేశ్వర రావు, ఎస్డిసి శ్రీమతి విజయ జ్యోతి, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్., మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post