పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు,జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు తో కలిసి అధికారులతో సమావేశమై, ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరియు ఎపి ఓపెన్ స్కూల్స్ 10 తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారిచేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-45 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఎంపిక చేసిన 165 పరీక్షా కేంద్రాలలో 28,632 మంది విద్యార్ధులు హాజరు కానున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. అలాగే ఈ నెల 16వ తేదీ నుండి ఈ నెల 28వ తేదీ వరకు ఎపి ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9-30 గంటల నుండి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎపి ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలకు ఎంపిక చేసిన 14 పరీక్షా కేంద్రాలలో 1,144 మంది విద్యార్ధులు హాజరు కానున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు. అలాగే ఈ రోజు (2-3-2026) నుండి మార్చి 13వ తేదీ వరకు ఎపి ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షలు జిల్లా లో మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,909 మంది విద్యార్ధులు హాజరు కానున్నట్లు జాయింట్ కలెక్టర్ వివరించారు.
ఈ పరీక్షలు ఉదయం ఉదయం 9-00 గంటల నుండి మధ్యాహ్నం 12-00 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
10వ తరగతి మరియు ఎపి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత పరీక్షల ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడంతో పాటు బందోబస్తు కొరకు అవసరమైన పోలీసులను నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను మూత వేయించాలన్నారు.
ముఖ్యంగా పరీక్షా కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన మేర చీఫ్ సూపరింటెండెంట్స్, రూట్ ఆఫీసర్లను, ఇన్విజిలేటర్లను నియమించాలని ఆయన ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని, పరీక్షలు జరుగు రోజున ఫ్లైయింగ్ స్క్వాడ్ చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశానికి జిల్లా విద్యా శాఖాధికారి శ్రీమతి రేణుక, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, సి పి డి సి ఎల్ ఎస్.ఈ వెంకటేశ్వర రావు, ఆర్.టి.సి., విద్యుత్, తపాలా, ఖజానా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

