తెలుగుదేశం పార్టీ ఏలూరుజిల్లా అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన ఏలూరు MLA బడేటి చంటి.






 తెలుగుదేశం పార్టీ ఏలూరుజిల్లా అధ్యక్షులుగా  ప్రమాణస్వీకారం చేసిన ఏలూరు MLA బడేటి చంటి.

 క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ చక్రవర్తి.

ఏలూరు, డిసెంబర్ - 29.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జిల్లాలోని అన్ని స్థానాల్లో నూటికి నూరుశాతం విజయ ఢంకా మ్రొగించి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కానుకగా అందిస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసిపి నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని, ఇటువంటి చిల్లర చేష్టలతో వైసిపి ప్రజలకు మరింత దూరం అయ్యిందని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలను మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా సిట్ నివేదిక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పార్టీ ప్రకటించిన తర్వాత మంచిరోజుకావడంతో సోమవారం బడేటి చంటి ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలోని పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

        ఈ సందర్భంగానే సర్వమత ప్రార్ధనలు నిర్వహించిన మత పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటిని ఆశీర్వదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ, పార్టీ శ్రేణుల సమావేశంలోనూ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన గురుతర బాధ్యతకు శక్తివంచన లేకుండా పూర్తిస్థాయి న్యాయం చేసేందుకు కృషిచేస్తానన్నారు. జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ పార్టీని ప్రగతిపథంలో నడపడంతో పాటూ జిల్లాలో పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. మరీముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అన్నిచోట్లా అభ్యర్థులను ఎంపిక చేసి నూరుశాతం విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. పార్టీలోని ప్రతీ కార్యకర్తా పార్టీ కష్టకాలంలో అండగా ఉండి అధికారంలోకి రావడానికి ఎంతో కృషిచేశారని, అటువంటి వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు తన పరిధిలో తాను శాయశక్తులా కృషిచేస్తానని బడేటి చంటి హామీ ఇచ్చారు. తనను రికార్డుస్థాయి మెజార్టీతో గెలిపించేందుకు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వైసిపి నాయకులు, కార్యకర్తలు రఫా రఫా అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకేత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వారి ఆటకట్టించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటువంటి ఉడత ఊపులకు తెలుగుదేశం పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలుగానీ. భయపడే ప్రశక్తి లేదని, సరైన సమయంలో సరైన బుద్ది చెప్పడం జరుగుతుందన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కొన్నా వైసిపి నాయకులకు జ్ఞానోదయం కలగలేదని, భవిష్యత్తులో మరింత దారుణమైన ఫలితాలను చవిచూడాల్సిన పరిస్థితులు వైసిపికి ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో వైసిపి ప్రభుత్వ హయాంలో కల్తీసారా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ఈ విషయమై అప్పట్లో టిడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినట్లు బడేటి చంటి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు అవి సహజ మరణాలంటూ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు. అయితే ప్రస్తుతం సిట్ నివేదిక ఆధారంగా అవి కల్తీ సారా మరణాలేనని స్పష్టమైందని, ఈ నివేదిక జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాంటిదని బడేటి చంటి అన్నారు. ఈ వ్యవహారంలో పాత్రపోషించిన శాఖాధికారులు, అప్పటి పార్టీ నాయకులు తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు వారానికి నాలుగు కానీ, ఐదు రోజులు కానీ తాను కార్యాలయానికి వస్తానని దీనిపై అందరితో మాట్లాడి సమయాలను నిర్దేశించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గ పార్టీ నాయకులు వీరమల్లు నరసింహారావు, కొడాలి వినోద్, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గూడవల్లి వాసు, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జంపా సూర్యనారాయణ, అహ్మద్ ఖాజా షేక్, కార్యదర్శి చింతాటి జ్యోతి, పార్టీ సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post