రీ సర్వే చేయించుకోవాలి: జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
శ్రీకాకుళం, జూలై 3:
ప్రతి రైతు తమ భూములకు తప్పనిసరిగా రీ సర్వే చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఎల్.ఎన్.పేట మండలం కొత్తపేట రెవెన్యూ పరిధిలోని గోలుగొప్ప గ్రామంలో రీ సర్వే చేయించేందుకు నిరాకరించిన ఓ భూ యజమానిని జాయింట్ కలెక్టర్ స్వయంగా కలిసి అవగాహన కల్పించారు. రీ సర్వే పూర్తయితే భూమి సాగు హక్కుదారుగా ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తుందని, అందువల్ల ప్రతి రైతు రీ సర్వేకు సహకరించాలని కోరారు. ఒకసారి పునరాలోచించి రీ సర్వేకు అంగీకరించాలని భూ యజమానిని సూచించారు.
అనంతరం తురకపేటలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్, ఎరువుల నిల్వలు, సరఫరా వివరాలను దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ముంగన్న అగ్రహారం గ్రామంలో జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ పర్యటనలో శ్రీకాకుళం ఆర్డీఓ కె. సాయి ప్రత్యూష, తహసీల్దార్ జె. ఈశ్వరమ్మ, డిప్యూటీ తహసీల్దార్, వ్యవసాయ అధికారి, సర్వేయర్, రీ సర్వే బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

