అటవీ వన్యప్రాణుల రక్షణకు అధునాతన సాంకేతికత.

అటవీ వన్యప్రాణుల రక్షణకు అధునాతన సాంకేతికత.

- "హనుమాన్" మొబైల్ యాప్‌పై సిబ్బందికి అవగాహన సదస్సు.

- ఏలూరు అటవీ డివిజన్ పరిధిలో ముమ్మరంగా సాగుతున్న నిఘా మరియు రెస్క్యూ ఏర్పాట్లు-డీఎఫ్ ఓ సందీప్ రెడ్డి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

            ఏలూరు, మే, 23 : అటవీ శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని సిబ్బందికి "హనుమాన్" (HANUMAN) మొబైల్ అప్లికేషన్ వినియోగంపై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం (వర్క్‌షాప్) నిర్వహించారని ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి చెప్పారు. వన్యప్రాణులు అటవీ ప్రాంతం దాటి జనావాసాల వైపు వస్తున్నప్పుడు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు, క్షేత్రస్థాయి సిబ్బందికి (Field Staff) ఈ యాప్ ద్వారా తక్షణ "లైవ్ అలర్ట్స్" అందుతాయన్నారు. జంతువులకు గాయాలైనా లేదా నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించినా... రాపిడ్ రెస్క్యూ వాహనాలను (Rapid Rescue Vehicles) మరియు ప్రత్యేక వైల్డ్ లైఫ్ అంబులెన్స్‌లను జీపీఎస్ (GPS) ద్వారా ట్రాక్ చేస్తూ, వేగంగా సంఘటనా స్థలానికి చేరుకునేలా ఈ యాప్ సహాయపడుతుందన్నారు. వన్యప్రాణుల రక్షణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఏర్పాటు చేసిన "వజ్ర" వాలంటీర్ల నెట్‌వర్క్‌ను ఈ యాప్ ద్వారా అటవీ శాఖతో నేరుగా అనుసంధానించడం జరిగిందని, పులులు , చిరుత పులుల కదలికలను నిరంతరం పర్యవేక్షించడం, కెమెరా ట్రాప్ డేటాను క్రోడీకరించడం ద్వారా మానవ-వన్యప్రాణి ఘర్షణలను ముందస్తుగానే నివారించవచ్చన్నారు. ప్రస్తుతం సమాజంలో మానవ-వన్యప్రాణి ఘర్షణ అనేది ప్రజా భద్రతకు, వన్యప్రాణుల సంరక్షణకు ఒక పెద్ద సవాలుగా మారిందని,. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 

          ఈ సదస్సుకు ఏలూరు డివిజన్ నుండి వివిధ కేడర్లకు చెందిన సుమారు 32 మంది అటవీ అధికారులు, సిబ్బంది (ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు) ప్రత్యక్షంగా హాజరవగా, మిగిలిన వారు ఆన్‌లైన్ ద్వారా పాల్గొని యాప్ పనితీరుపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకున్నారు.

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post