పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి కలెక్టర్.


 పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి కలెక్టర్.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామస్థాయిలో ప్రజలతో చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ' పల్లెనిద్ర ' కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన కొత్తపట్నం మండలంలోని కె.పల్లెపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుతో కలిసి గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన సమస్యలను ఓపికతో విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అంశంగా ప్రభుత్వం దృష్టి సారించిందని, జిల్లా అధికార యంత్రాంగము కూడా ఈ దిశగా చర్యలను వేగవంతం చేసిందన్నారు. ' మీకోసం ' కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని, మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ' పల్లెనిద్ర ' కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తనతోపాటు జిల్లా అధికారులు కూడా మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేలా వారికి దిశా నిర్దేశం చేసినట్లు చెప్పారు. 

గ్రామ సమస్యలు ఇవీ

ఈతముక్కల గ్రామంలో బకింగ్ హామ్ కాలువపై వంతెన శిథిలావస్థకు చేరింది. దీని స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలి. 

పల్లెపాలేనికి వస్తున్న రోడ్డులో బకింగ్ హామ్ కెనాల్ పైన నిర్మించిన బ్రిడ్జి వద్ద రోడ్డు సైడ్ బ్యారియర్స్ నిర్మించాలి. 

స్థానిక మత్స్యకార కుటుంబాల్లోని యువత చదువుకున్నప్పటికీ తగిన నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి తగిన శిక్షణ ఇప్పించి రామాయపట్నం పోర్టులో ఉద్యోగాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. 

మత్స్యకారుల బోట్లుకు సబ్సిడీ ఆయిల్ సక్రమంగా ఇవ్వాలి. 

 తమిళనాడు జాలర్లు మన సముద్ర జలాల్లో చేపల వేట చేయకుండా గస్తీ కోసం ప్రకాశం జిల్లాకు కూడా ప్రభుత్వం ఒక బోటు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. 

స్థానికంగా ఫిషింగ్ హార్బర్ త్వరగా ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. 

 కొత్తపట్నం నుంచి ఒంగోలుకు వెళ్తున్న బస్సును 

డిపో వరకూ పొడిగించాలి. 

మడనూరు పట్టపుపాలానికి సి.సి.రోడ్డు నిర్మించాలి. 

పల్లెపాలెంలో అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సుమారు 1250 మందికి కావాలి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములపై ప్రభుత్వానికి నివేదించాలి. 

అర్జీలు ఇలా పరిష్కారం 

తమ అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించిన తీరును కూడా స్థానికులు ఈ కార్యక్రమంలో వివరించారు. 

మత్స్యకార కుటుంబానికి చెందిన నాకు పెన్షన్ మంజూరు చేయాలని పెట్టుకున్న అర్జీని అధికారులు పరిష్కరించి పెన్షన్ మంజూరు చేయించినట్లు పి. పరమేశ్వరరావు ( కె.పల్లెపాలెం) తెలిపారు. 

భూమి ఆన్లైన్ చేయాలంటూ తాను పెట్టుకున్న అర్జీని అధికారులు పరిష్కరించినట్లు ఆర్.చలపతి ( గుండమాల ) చెప్పారు. 

 తన అర్జీని అధికారులు పరిశీలించి వితంతు కోటాలో పెన్షన్ మంజూరు చేయించినట్లు బంగారమ్మ (కె.పల్లెపాలెం) తెలిపారు. 

మెరుగైన జీవనోపాధి కోసం స్వయం సహాయక సంఘంలో ఉన్న తనకు అధికారులు బ్యాంకు రుణం మంజూరు చేయించినట్లు పి.శ్రావణి కుమారి ( ఈతముక్కల ) వెల్లడించారు.  

 స్వయం సహాయక సంఘ సభ్యురాలు అయిన తాను కుటుంబ పోషణకు మెరుగైన ఆదాయం లభించేలా ఫుడ్ కోర్టు పెట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందని కె.హరిణి ( రంగాయపాలెం ) చెప్పారు. 

గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్. వెంకట్రావు పాల్గొన్నారు. 

 కాగా, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉదయం తమకు కేటాయించిన గ్రామాలలో పర్యటించి, ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ లోని ఇళ్లనిర్మాణం, సిమెంట్ రోడ్డు, ఇళ్ల స్థలాలు, స్మశాన స్థలం కేటాయింపు, నీటి వనరుల వద్ద అపరిశుభ్రత, ఆక్వాకల్చర్ కు సబ్సిడీ కరెంట్, రెవెన్యూ కు సంబంధించి ఆన్లైన్ సమస్యలను  

ప్రస్తావించినట్లు తెలిపారు. వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post