విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి: ఎం ఈ ఓ..
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు సిఆర్పీలు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది కృషి చేయాలని ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, టి.శ్రీనివాసులు అన్నారు. రానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని,పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా చేసుకోవాలన్నారు. గ్రామాల్లో డ్రాప్‌అవుట్ విద్యార్థులను గుర్తించి, తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేందుకు అమలులో ఉన్న విద్యా పథకాల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు.
సిఆర్పీలు తమ పరిధిలోని ప్రతి పాఠశాలను సందర్శించి, విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాలు,వసతులు సదుపాయాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని, విద్యార్థుల సంఖ్య పెంపు కోసం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, విద్యపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం,ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడం కీలకమని వివరించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న తల్లికి వందనం,
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ వంటి సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచాలన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన జిఎఫ్ఎల్ఎన్ పోటీల్లో కంభం విద్యార్థుల ప్రతిభ వెనుక సిఆర్పీల కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో సిఆర్పీలు, మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
