బీసీ రిజర్వేషన్లపై మే 1న ‘డెడికేటెడ్ కమిషన్’ బహిరంగ విచారణ.



బీసీ రిజర్వేషన్లపై మే 1న ‘డెడికేటెడ్ కమిషన్’ బహిరంగ విచారణ.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి శంకర్ రాజ్.

శ్రీకాకుళం, ఏప్రిల్ 29: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ‘డెడికేటెడ్ కమిషన్’ మే 1వ తేదీన జిల్లాలో పర్యటించనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిషన్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 'ట్రిపుల్ టెస్ట్' నిబంధనలను అనుసరిస్తూ బీసీల వెనుకబాటుతనంపై క్షేత్రస్థాయిలో అనుభవాధారిత పరిశోధన నిర్వహించనుంది. ఇందులో భాగంగా మే 1న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఆసక్తి గల వ్యక్తుల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరిస్తారని, అనంతరం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి కమిషన్ బృందం క్షేత్ర పర్యటన చేపడుతుందని ఆయన వివరించారు.

జిల్లాలోని బీసీ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ విన్నపాలను వ్రాతపూర్వకముగా కమిషన్‌కు అందజేయాలని కలెక్టర్ సూచించారు. వినతిపత్రాలు కేవలం స్థానిక సంస్థల్లో బీసీల స్థితిగతులు, రిజర్వేషన్ల శాతానికి సంబంధించిన అంశాలకే పరిమితమై ఉండాలని, ప్రతిపాదనలతో పాటు తగిన సాక్ష్యాధారాలు లేదా పత్రాల నకళ్లను జతచేయాలని కోరారు. నిర్ణీత సమయంలో కలెక్టరేట్‌కు చేరుకుని కమిషన్ ప్రతినిధులను కలిసి తమ సామాజిక వర్గాల వెనుకబాటుతనంపై స్పష్టమైన గణాంకాలు, వాస్తవ వివరాలను సమర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post