ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్ - వడ్డీపై 50శాతం రాయితీ.
పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ రమణబాబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు.
ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని,
ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు ప్రజలను కోరారు.
ఈ రాయితీ పొందాలంటే పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఏడాది పన్నును కలిపి ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని, ఈ నెల (మార్చి 31) లోపు చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం కల్పించిన ఈ ప్రత్యేక వడ్డీ రాయితీ సదుపాయం ఒక సువర్ణావకాశం అని, ప్రజలు చురుకుగా స్పందించి పన్నులు చెల్లించడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, పట్టణ అభివృద్ధికి సహకరించిన వారవుతారన్నారు.
అలాగే గిద్దలూరు పట్టణ వాసులు కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, ట్రేడ్ లైసెన్సు పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.
గడువు ముగిసిన తర్వాత పూర్తి వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది కావున అప్పటి వరకు వేచి చూడకుండా పాత బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఈ వి. రమణ బాబు ప్రజలకు ఒక ప్రకటనలో తెలియజేశారు.
