వారసత్వ భూమిపై తప్పుడు ప్రచారం చేయొద్దు.


 వారసత్వ భూమిపై తప్పుడు ప్రచారం చేయొద్దు.

మా జిరాయితీ భూమిని విక్రయిస్తే వివాదాలు సృష్టించడం సరికాదు: ఉర్నాన సోదరులు.

పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఎవరికీ ఇవ్వలేదు: కవిటి తహసీల్దార్‌ కళ్యాణ చక్రవర్తి.

క్రైమ్ 9మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి 

పలాస అక్టోబర్ 06: తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయితీ భూమిని విక్రయించడంపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉర్నాన మోహనరావు, ఉర్నాన శంకరరావు ఆరోపించారు. సోమవారం పలాసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, పలాస కిడ్నీ ఆసుపత్రి సమీపంలోని సర్వే నంబర్‌ 254/3సి భూమి తమ పిత్రార్జిత ఆస్తి అని తెలిపారు. తమ అవసరాల నిమిత్తం భూమిని విక్రయించగా, అనవసర వివాదాలు సృష్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

నీలావతి గ్రామానికి చెందిన సొర్ర సోమయ్య, సొర్ర రాజేశ్వరి కొనుగోలు చేసిన భూమి తమ స్థలానికి సుమారు 17 మీటర్ల దూరంలో ఉందని రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చినట్లు ఉర్నాన సోదరులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గతంలో పోలీసుల విచారణ జరిగిందని, తమ భూమితో సంబంధం లేదని అవతలి పక్షంతో ఒప్పంద పత్రం కూడా రాయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయించినప్పటికీ, తప్పుడు ప్రచారంతో మనస్తాపానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, గతంలో పలాస తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుతం కవిటి తహసీల్దార్‌గా ఉన్న టీ. కళ్యాణ చక్రవర్తి స్పందిస్తూ, సదరు భూములకు సంబంధించి తాను ఎవరికీ పొజిషన్‌ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని స్పష్టం చేశారు. అప్పట్లో పోలీసుల అభ్యర్థన మేరకు ఇరువర్గాల సమక్షంలో భూమిని పరిశీలించి నివేదిక మాత్రమే ఇచ్చానని, ఎవరికీ ప్రత్యేక హక్కులు కల్పిస్తూ నివేదిక ఇవ్వలేదని తెలిపారు. ఊహాగానాలతో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post