క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి.
పలాస అక్టోబర్ 06:
పలాస నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన 12 రోజుల్లోనే వంశధార జలాలను నియోజకవర్గానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
పలాస మండలం లొద్దభద్రలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్, కమ్యూనిటీ హాల్‌ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన 12 రోజుల్లోనే వంశధార నీటిని తీసుకొచ్చామని, గతంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజు మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన 41 వేల మెజారిటీకి బాధ్యతగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
బోర్ నీటిని తాగునీటిగా, వంట అవసరాలకు వినియోగించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్‌లను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. పలాస నియోజకవర్గంలో తాగునీరు, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు.
