వైఎస్సార్ పాలనలోనే సంక్షేమం–అభివృద్ధికి పెద్దపీట.
పేదల సంక్షేమమే వైఎస్సార్ ఆశయం.. ఆయన బాటలోనే వైఎస్సార్‌సీపీ పోరాటం.
అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి: మాజీ మంత్రి అప్పలరాజు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్.
పలాస ఆగష్టు 02: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్సార్ పాలనలో పేదలు, రైతులు, సామాన్య ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా వైఎస్సార్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.
గత రెండున్నరేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న అనేక మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని అప్పలరాజు ఆరోపించారు. ప్రభుత్వం మూడు లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పంచాయతీలకు పరిమిత సంఖ్యలోనే పెన్షన్లు అందుతున్నాయని విమర్శించారు. ఒక్కో పంచాయతీకి 10 నుంచి 20 పెన్షన్లు మాత్రమే మంజూరు చేస్తే అర్హులైన వారందరికీ ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అర్హులందరినీ గుర్తించి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన 108, 104 అత్యవసర వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని అప్పలరాజు గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం పారిశ్రామిక పార్క్, రిమ్స్, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ, వంశధార ఫేజ్-2, హిరమండలం రిజర్వాయర్ వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్సార్ హయాంలోనే ప్రాధాన్యత లభించిందన్నారు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం హార్బర్, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ వంటి పలు కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై కూడా అప్పలరాజు విమర్శలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు.
వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమమే తమకు స్ఫూర్తి అని పేర్కొన్న అప్పలరాజు.. పేదలు, రైతులు, సామాన్య ప్రజల హక్కులు, సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు.

