పాఠశాలలకు గ్రో బ్యాగ్స్ పంపిణీచేసిన ఎం ఇ వో.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం, ఆగస్టు 20: పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం, సేంద్రియ సాగు, మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్కూల్ న్యూట్రి గార్డెన్ కార్యక్రమంలో భాగంగా కంభం మండలంలో తగిన స్థలం లేని పాఠశాలలకు గురువారం ఎంఈవో అబ్దుల్ సత్తార్ గ్రో బ్యాగ్స్ కిట్లను పంపిణీ చేశారు. స్థలం కొరత కారణంగా పాఠశాల ప్రాంగణంలో నేరుగా న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయలేని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు మొక్కల పెంపకం, కూరగాయల సాగుపై ప్రత్యక్ష అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కిట్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పంపిణీ చేసిన కిట్లలో కోకోపీట్, వర్మీ కంపోస్ట్, వివిధ రకాల విత్తనాలు, స్ప్రే బాటిల్, నీం ఆయిల్, గ్రో బ్యాగ్స్ తదితర సామగ్రి ఉన్నాయనీ,వీటిని ఉపయోగించి తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు, ఇతర పోషక విలువలు కలిగిన మొక్కలను పెంచుకోవచ్చన్నారు.
గ్రో బ్యాగ్స్‌లో మొక్కలను పెంచే విధానం, కిట్లలోని వస్తువుల ఉపయోగం, మొక్కల సంరక్షణ, నీటి వినియోగం, సహజ పద్ధతుల్లో తెగుళ్ల నివారణ వంటి అంశాలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశారు.
కోకోపీట్ మొక్కల వేర్లకు తగిన తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుందని, వర్మీ కంపోస్ట్ మొక్కలకు అవసరమైన సేంద్రియ పోషకాలను అందిస్తుందని, విత్తనాలను తగిన లోతులో నాటడం, మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందించడం, అధిక నీటితో వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మొక్కలకు తెగుళ్లు సోకకుండా నీం ఆయిల్‌ను సూచించిన పద్ధతిలో నీటితో కలిపి స్ప్రే చేయడం ద్వారా సహజ పద్ధతిలో సంరక్షణ చేపట్టవచ్చని వివరించారు. స్ప్రే బాటిల్‌ను అవసరమైన సమయంలో మాత్రమే వినియోగించాలని సూచించారు.
న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు కేవలం మొక్కల పెంపకం మాత్రమే కాకుండా విత్తనం నుంచి మొక్క ఎదుగుదల వరకు జరిగే ప్రక్రియను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందనీ, పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ సాగు, పోషకాహారం, పరిశుభ్రత, ప్రకృతి పట్ల బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఇదిఉపయోగపడుతుందన్నారు.
పాఠశాలల్లో పెంచే కూరగాయలు, ఆకుకూరల ద్వారా తాజాగా లభించే పోషకాహారం ప్రాముఖ్యతను విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని,స్థలం అందుబాటులో లేని పాఠశాలల్లో గ్రో బ్యాగ్స్ విధానం తక్కువ స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు..
