ఏలూరులో న్యాయ విజ్ఞాన సదస్సు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
25ఆగష్టు, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు వారి ఆధ్వర్యంలో ప్యానల్ న్యాయవాదులు పి. వెంకటేశ్వరరావు, జీ.వి భాస్కర్ ఏలూరు రైల్వే స్టేషన్, అంబేద్కర్ భవనము దగ్గర ఉన్న వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహము నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థలు ప్రజలలో చట్టాల పట్ల అవగాహన కలిగించి, చైతన్య వంతులను చేయటం కోసం నిరంతరము న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తుందని, అలాగే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సమాజంలోని ప్రతి వర్గాలకు ఉచిత న్యాయ సేవలు చేరువ చేయటం కోసం వివిధ పథకాల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేస్తుందని అందులో భాగంగా "జాగృతి పథకం (డాన్) 2025" ప్రచారంలో భాగముగా యువతకు న్యాయ అక్షరాస్యత- బాలల న్యాయము మరియు న్యాయ ప్రాప్తిని ప్రోత్సహించడం అంశాలపై ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలను నేర్చుకోవడమే కాకుండా మీ మీ గ్రామాలలో ప్రజలను కొంతమేరైన అవగాహన కలిపే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత భారత దేశంలో నిరుద్యోగులు గణనీయంగా పెరుగుతున్నారని, వారి యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఉద్యోగం పేరిట చట్ట వ్యతిరేక పనులను చేయిస్తున్నారని, కావున తగిన సమాచారం సేకరించిన తర్వాతే ఆయా సంస్థలలో ఉద్యోగ నిమిత్తం చేరాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని, కావున దేశంలో ఎక్కడ నుంచైనా, న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించవచ్చని సూచించారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా 15100 ద్వారా మీ సమస్యలను తెలియపరచి పరిష్కారం పొంద వచ్చని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య వాతావరణ కాలుష్యం, దాన్ని నివారించడానికి ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి దానిని పెంచే బాధ్యత తీసుకొని సమాజానికి ఎంతో కొంత తమ వంతు దిశ సేవ చేసి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు మరియు కార్యక్రమంలో న్యాయవాది కె. కుటుంబరావు, హాస్టల్ వార్డెన్ ఎస్ రాజబాబు పాల్గొన్నారు.
