ఆధార్ వ్యత్యాసాల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలి – ఎంఈవో అబ్దుల్ సత్తార్.



 ఆధార్ వ్యత్యాసాల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలి – ఎంఈవో అబ్దుల్ సత్తార్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కంభం, జూలై 15: విద్యార్థుల ఆధార్ వ్యత్యాసాల పరిష్కారంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ప్రభుత్వం అందిస్తున్న 'తల్లికి వందనం' పథకం నగదు సకాలంలో జమ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) అబ్దుల్ సత్తార్ ఉపాధ్యాయులకు సూచించారు.

బుధవారం ఆయన కంభం పట్టణంలోని నాయక్ వీధి ప్రాథమిక పాఠశాల, శ్రీ సత్యనారాయణ ఎయిడెడ్ పాఠశాల, కృష్ణవేణి పాఠశాల, కందులాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, పార్క్ వీధి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, నమోదు వివరాలు, ఆధార్ వ్యత్యాసాల సవరణ ప్రక్రియ, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రస్తుతం ఆధార్‌లో ఉన్న పేరు, జన్మతేదీ, తల్లిదండ్రుల ఆధార్ వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నా వెంటనే గుర్తించి సరిచేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. ఆధార్ వివరాల్లో చిన్నపాటి పొరపాట్లు కూడా సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రతి విద్యార్థి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో సవరించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకుంటూ పలు తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి పఠనం, రాత, గణిత నైపుణ్యాలను పరీక్షించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాజరు నమోదవుతున్న తీరు, తరగతి గదుల నిర్వహణ, బోధన విధానాలను పరిశీలించిన ఎంఈవో, నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలు అర్హులైన అన్ని కుటుంబాలకు చేరేలా పాఠశాల స్థాయిలో చర్యలు తీసుకోవాలని, ఆధార్ వ్యత్యాసాల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని ఎంఈవో అబ్దుల్ సత్తార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఆర్పీ మురళీమోహన్,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post