ఉపాధి హామీ కూలీల హక్కులను కాపాడాలి – సీపీఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్.



ఉపాధి హామీ కూలీల హక్కులను కాపాడాలి – సీపీఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్.

 నూకాలమ్మ చెరువులో యంత్రాలతో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.

జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో నూకాలమ్మ చెరువులో యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారనే నిరసనగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (గ్రాంజీ ) కూలీలు గ్రామంలో యాత్రగా వెళ్లి గ్రామ సచివాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించి సచివాలయ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది 

ఈ సందర్భంగా సీపీఎం మండల కన్వీనర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం పనులను యంత్రాలతో నిర్వహించడం వల్ల కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూకాలమ్మ చెరువులో జరుగుతున్న పనులను ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపట్టాలని కోరారు.

చెరువులో యంత్రాలతో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించాలని, ఉపాధి హామీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని ఉపాధి కూలీలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

అదేవిధంగా “నీటి గట్టు సంఘం” పేరుతో జరుగుతున్న పనులపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్‌వోసీ (NOC) వివరాలను పరిశీలించి, ఆ అనుమతుల మేరకే పనులు జరుగుతున్నాయా లేదా అన్న అంశంపై పూర్తి స్థాయి పరిశీలన చేపట్టాలని కోరారు. అక్రమ మట్టి తవ్వకాలు లేదా మట్టి తరలింపు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూకాలమ్మ చెరువు ఉపాధి హామీ పథకం పరిధిలో ఉంటే, అక్కడ యంత్రాల వినియోగం నిషేధమని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పనుల వివరాలు, అనుమతులు, అంచనా వ్యయం తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే సమాచార బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ చట్టం ప్రకారం పని కోరిన ప్రతి అర్హ కూలీకి ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కూలీల హక్కులను పరిరక్షించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారానికి అధికారులు త్వరితగతిన స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సీపీఎం నాయకులు, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post