పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆత్మీయ సందేశం.
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా కలెక్టర్ పి,రాజబాబు,గారి శుభాకాంక్షలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
సాంఘిక సంక్షేమ, బి.సి, గిరిజన మరియు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రేపటి నుంచి (మార్చి 16) ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. మీరు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థుల సౌలభ్యం కోసం
ఈ క్రింది సూచనలు చేయడం జరుగుతోంది:
పరీక్షా సమయంలో విద్యార్థులు పాటించవలసిన ముఖ్య సూత్రాలు:
ప్రశాంతత వహించండి: పరీక్షకు ముందు రోజు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. సరైన నిద్ర, ఆహారం అవసరం.
సమయ పాలన: పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలి. దీనివల్ల అనవసరపు హడావిడి తప్పుతుంది.
OMR షీట్ జాగ్రత్త: మీకు ఇచ్చిన OMR షీట్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. రూమ్ నంబర్, సబ్జెక్టు కోడ్, ఆన్సర్ బుక్ నంబర్లను సరిగా నమోదు చేయాలి. మీ సంతకం మరియు ఇన్విజిలేటర్ సంతకం ఉండేలా చూసుకోవాలి.
ప్రశ్నపత్రం అవగాహన: ప్రశ్నపత్రాన్ని అందిన వెంటనే ఒకటికి రెండుసార్లు పూర్తిగా చదవండి. ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాతే సమాధానం రాయడం ప్రారంభించండి.
ముందుగా తెలిసినవి రాయండి: మీకు బాగా వచ్చిన సమాధానాలను మొదట రాయండి. కొట్టివేతలు లేకుండా, స్పష్టంగా అందమైన అక్షరాలతో (ముత్యాల్లాంటి రాతతో) పాయింట్ల వారీగా రాస్తే మార్కులు మెరుగ్గా వస్తాయి.
ప్రశ్న నంబర్ తప్పనిసరి: ప్రతి సమాధానానికి ఖచ్చితమైన ప్రశ్న నంబర్ వేయడం మర్చిపోవద్దు. నంబర్ వేయకపోతే ఆ సమాధానం పరిగణనలోకి రాదని గుర్తుంచుకోండి.
ఖాళీగా వదలకండి: ప్రతి విభాగంలో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సరిగ్గా తెలియని ప్రశ్నలకు కూడా మీకు తెలిసిన సమాచారాన్ని రాయండి కానీ పేజీని ఖాళీగా వదలవద్దు.
బొమ్మలు (డయాగ్రమ్స్): ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులో అవసరమైన చోట పెన్సిల్‌తో స్పష్టమైన బొమ్మలు గీసి భాగాలను గుర్తించండి.
ఇది మీ స్కోరును పెంచుతుంది.
పేజీ నంబర్లు & ఆర్డర్: మీరు రాసే ప్రతి పేజీకి నంబర్ వేసి, సమాధాన పత్రాలను క్రమ పద్ధతిలో జత కట్టండి.
సద్వినియోగం చేసుకోండి: మేము సరఫరా చేసిన స్టడీ మెటీరియల్‌ను క్షుణ్ణంగా చదవండి. దీనివల్ల సగటు విద్యార్థి కూడా సులభంగా ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, మెరిట్ విద్యార్థులు అత్యుత్తమ స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. చివరి నిమిషం వరకు పరీక్షా కేంద్రంలోనే ఉండి, రాసిన సమాధానాలను మరోసారి సరిచూసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. క్రమశిక్షణతో, ఏకాగ్రతతో పరీక్షలు రాసి మన జిల్లాకు పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విజయీభవ!
