అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.---ఐ.ఎఫ్.టి.యు డిమాండ్.

 అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.---ఐ.ఎఫ్.టి.యు డిమాండ్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు, ఫిబ్రవరి, 27:రాష్ట్రంలోని లక్ష మంది అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బద్దా వెంకటరావు, ఏలూరు నగర కార్యదర్శి కామ్రేడ్ యర్రా శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు.స్థానిక వి.వి.నగర్ వద్ద మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ప్రదర్శన జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బద్దా వెంకటరావు మాట్లాడుతూ అంగన్వాడీలు గతంలో 42 రోజుల రాష్ట్ర వ్యాప్త చారిత్రాత్మక సమ్మె సందర్భంగా కూటమినేతలు ఆరోజు అంగన్వాడీల శిబిరాల్లోకి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ హామీలను నెరవేరుస్తామని అనేక వాగ్దానాలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించలేదని వారు విమర్శించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. మార్చి 2 తేదీన రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో మహాధర్నా చేపట్టబోతున్నారన్నారు. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టియు) తరఫున పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్రంలో లక్షకు పైగా అంగన్వాడీలు ఆందోళన చేస్తోంటే ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోకపోవడం భావ్యం కాదని ఐ.ఎఫ్ టి.యు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు పి.ఆర్.సి లింక్ చేసి జీతాలు పెంచాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారమంతవరకు ఆందోళన చేపట్టాలని, దానికి ఐ.ఎఫ్ టి.యు సంఘీభావం తెలియజేస్తుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్ టి.యు ఏలూరు నగర అధ్యక్షులు బి.సోమయ్య,యార్డు హమాలీ వర్కర్స్ ఐ ఎఫ్ టి యు నాయకులు మీసాల రమణ,ధన్నాన విజయ్, సింహాచలం, మోహన్, నూకరాజు, మంగరాజు, రాములమ్మ, పద్మ, డేవిడ్, పండు, వాసు తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు.

 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post