సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలి.
సిరిపురంలో వరుణ యాగం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి.
మందస అక్టోబర్ 06: సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ పలాస నియోజకవర్గం మందస మండలం సిరిపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ రఘునాథ స్వామి దేవస్థానంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. నియోజకవర్గం తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని రఘునాథ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభించి, రైతులు సాగు చేస్తున్న పంటలు ఆశించిన స్థాయిలో చేతికి రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి కొరత తొలగి చెరువులు, జలాశయాలు నిండి రైతులకు అవసరమైన నీరు అందుబాటులోకి రావాలని కోరారు.
రైతులతో పాటు వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, పలాస నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

