ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగర విస్తరణ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చెప్పారు.
నగరంలోని పాత కూరగాయల మార్కెట్, నెల్లూరు బస్టాండ్ సెంటర్లతో పాటు ఇతర ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలలో వాణిజ్య, హోటల్, బ్యాంక్, తదితర రంగాలలో సేవలు అందించేందుకు అవసరమైన భవనాలను నిర్మించేలా ప్రణాళికలపై బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆయన చర్చించారు. కాగా, ఒంగోలు మాస్టర్ ప్లాన్ ను దృష్టిలో పెట్టుకుని పాత కూరగాయల మార్కెట్ సెంటర్ లోని ఖాళీ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళికను ఏ.పీ.యు.ఐ.ఏ.ఎం.ఎల్. ప్రతినిధి విశాల్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ పలు సూచనలు చేశారు. జిల్లాలో రామాయపట్నం పోర్టు, బిపిసిఎల్, ఇండోసోల్, జిందాల్ పరిశ్రమలు, గ్రానైట్ రంగం ద్వారా అభివృద్ధి మరింత వేగం పుంజుకోనున్నట్లు చెప్పారు. ఆ మేరకు జిల్లా కేంద్రమైన ఒంగోలులో షాపింగ్, ఆతిథ్యరంగాలు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒంగోలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలపైనా ఈ దిశగా దృష్టి సారించి ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని విశాల్, మున్సిపాలిటీ అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ ఐసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
