రోడ్డు ప్రమాదంలో పరవాడ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మృతి.



 రోడ్డు ప్రమాదంలో పరవాడ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మృతి.

విధి నిర్వహణకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో పరవాడ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మృతి: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా దిగ్భ్రాంతి.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఏప్రిల్: 25 అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తూ, పరవాడ పి.ఎస్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న

కె.పి.ఆర్.వి.ఎన్.ప్రసాద్ (హెచ్.సి 3585) శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రతి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది వారాంతపు రిపోర్టులు ఇచ్చేందుకు ప్రసాద్ సుజాతనగర్ నుండి అనకాపల్లికి తన బైక్‌పై బయలుదేరారు. సబ్బవరం మండలం ఇరువాడ వద్ద (ఆనందపురం - తుని ఎన్ హెచ్ 16) జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వెనుక నుండి వచ్చిన ఒక కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2000 బ్యాచ్‌కు చెందిన ప్రసాద్ విశాఖపట్నం సిటీలో కానిస్టేబుల్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తన సుదీర్ఘ సర్వీసులో 2వ టౌన్, 4వ టౌన్ శాంతిభద్రతల విభాగం, హార్బర్, స్టీల్ ప్లాంట్ మరియు పెందుర్తి ట్రాఫిక్ విభాగాల్లో మరియు ఎం.వి.పి.కాలనీ క్రైమ్ మరియు విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచ్ లో సమర్థవంతంగా పనిచేశారు. 2022 జిల్లాల విభజన అనంతరం అనకాపల్లి జిల్లాకు కేటాయించబడిన ఆయన, పరవాడ పీ.ఎస్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించారు. క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచారాన్ని సేకరించడంలో మరియు విధి నిర్వహణలో ఆయన చూపిన చొరవ జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణం.

ఇటీవల ప్రసాద్ కుమారుడు చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా నగదు పురస్కారం మరియు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆ ఆనందం మరువకముందే ఈ విషాదం చోటుచేసుకోవడం పట్ల తోటి ఉద్యోగులు, మిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక మంచి వ్యక్తిని, నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

​మృతుని కుటుంబానికి పోలీస్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు భరోసా ఇచ్చారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post